ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 28 June 2013

అమర్‌నాథ్‌ యాత్ర


  రమాత్ముడు ఒక్కడే అయినా రూపాలు అనేకం. సాకార, నిరాకార స్వరూపుడిగా భగవంతుడు ప్రకటితమవుతాడు. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు, అనంతకాల గమనాన్ని శాసిస్తూ అంచనాలకు అందని అమేయ స్వరూపుడు- విశ్వేశ్వరుడు. ప్రళయకాల సందర్భంలో సర్వేశ్వరుడు లింగాకృతిలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. లింగ స్వరూపం సృష్టి రహస్యానికి ప్రతీక. సకల చరాచర జగత్తు శివాంశతో పరిఢవిల్లుతోంది. శివపరమాత్మ ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగి, తానే ప్రకృతి ఆకృతిగా లింగమూర్తిగా ఆవిష్కారమయ్యాడు.

కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలని చెబుతారు. అలాగే సకల మనోభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి హిమలింగ దర్శనం, ఆరాధనం దోహదపడుతుందని పెద్దల మాట. మహిమాలయంగా వెలిగే హిమాలయ సీమల్లో ప్రకృతి రూపుడిగా, హిమలింగంగా అమరనాథునిగా ఏటేటా ఆవిర్భవిస్తున్నాడు. దివ్య ధవళ కాంతులతో, స్వచ్ఛ స్ఫటికంగా, సహజసిద్ధంగా ఏర్పడే అమరనాథుని మంచులింగాన్ని దర్శించుకోవడం భక్తులకు కమనీయ అనుభూతి. సహజాతమైన హిమలింగంగా కాలస్వరూపుడైన ముక్కంటి అభివ్యక్తం కావడం ఓ మహా విభూతి. నేటినుంచి అపురూపమైన ఆ అమరనాథ యాత్ర ఆరంభమవుతోంది.

అమరనాథ యాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతుల సమ్మేళనం. ఎన్నో వ్యయప్రయాసల సమ్మిశ్రితం. హిమధామంలో గుహాలయంలో నెలకొన్న హిమ సుందరేశ్వరుడైన అమరలింగేశ్వర దర్శనం పరమానందదాయకం. అమరనాథుని భవ్య లింగాకృతిని తిలకించగానే భక్తులు తమ ప్రయాసంతా మరిచి, ప్రమోదాన్ని పొందుతారు. ప్రతి భక్తుడి హృదయం ఆనంద రసార్ణవమవుతుంది.

జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,888మీటర్ల ఎత్తులో అమరనాథుని గుహాలయం భాసిల్లుతోంది. లోతైన లోయల మీదుగా, ఇరుకు దారుల వెంట, పర్వతాల్ని అధిరోహిస్తూ, ఎముకలు కొరికే చలిలో కాలినడకన, గుర్రాలపై సాగే ఈ ప్రయాణం సంక్లిష్టమైంది. అమరనాథుడిపై ఉన్న భక్తి, అచంచల విశ్వాసం, స్వామిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్షల వూతంగా ఈ యాత్ర కొనసాగుతుందని భక్తుల నమ్మకం. అమరనాథ్‌ యాత్ర చేయాలనుకునే భక్తులు ముందుగా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రప్రభుత్వ పర్యాటకశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలి. మంచుకొండల్లో, ప్రతికూల వాతావరణంలో ఈ యాత్రను చేపట్టాలి. అందుకు తగిన శారీరక సామర్థ్యం తమకు ఉన్నట్టుగా యాత్రికులు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది పర్యాటక శాఖకు సమర్పించాలి. ఈ యాత్రలో చందన్‌వాడీ నుంచి సాగే ప్రయాణం కీలకమైంది. పిస్సూటాప్‌, జోజిబాల్‌, నాగకోటి, శేష్‌నాగ్‌ వంటి ప్రదేశాల మీదుగా పయనం కొనసాగుతుంది.

హిమపర్వతాల మధ్యనుంచి వయ్యారంగా మెలికలు తిరిగే లిడ్జర్‌ నది సౌందర్యం, నీలిరంగు తటాకాలు, హొయలు మీరే పర్వతాలు, చూపును మరల్చుకోలేని ప్రకృతి అందాల సమాహారం మురిపిస్తాయి. ఇంతటి మహా సౌందర్య సన్నిధి కాబట్టే నీలకంఠుడు తన నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడనే భావన కలుగుతుంది. గుహాలయంలో అయిదు అడుగుల ఎత్తయిన శంఖువు ఆకృతిలో అమరనాథుడు విలసిల్లుతాడు. చంద్రుడి వృద్ధిక్షయాల్ని అనుసరిస్తూ ఈ మంచులింగం పెరుగుతూ, తరుగుతూ ఉంటుందంటారు. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో అమరనాథుడు సాకారమవుతూ, శ్రావణం తరలివచ్చే నాటికి అంతర్థానమవుతాడు. ఈ దివ్యక్షేత్రానికి సంబంధించిన ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఓ సందర్భంలో సృష్టి రహస్యాన్ని వివరించమని పార్వతి, పరమేశ్వరుణ్ని కోరింది. అమరమైన ఈ రహస్యాన్ని ఏ ప్రాణికీ వినిపించని ప్రదేశంలో చెబుతానన్నాడు శివుడు. హిమాలయాల్లో ఓ గుహలో సృష్టి మర్మాన్ని మహేశ్వరుడు, గౌరికి వెల్లడిస్తుండగా గుహపై ఉన్న పావురాల జంట విన్నాయంటారు. దాంతో అది మృత్యురాహిత్యాన్ని పొంది, ఇప్పటికీ అమరనాథుని గుహ ప్రాంతంలో సంచరిస్తాయని చెబుతారు.

కాశ్మీర రాజుల చరిత్ర తెలిపే 11వ శతాబ్దానికి చెందిన 'రాజ తరంగిణి' గ్రంథంలో ఈ క్షేత్ర వైభవాన్ని విశేషంగా పేర్కొన్నారు. కాశ్మీరదేశ రాణి సూర్యమతి అమరనాథుని సన్నిధికి పసిడి త్రిశూలం, బాణ లింగాల్ని సమర్పించింది. రాజా వాలి పతాక, ప్రజాభట్టు వంటి రాజులు అమరనాథుణ్ని ఇలవేల్పుగా ఆరాధించారు. అలాంటి మహా మహిమోపేతుడైన హిమలింగ రూపధారి అమరనాథుని దివ్యదర్శనం... అనన్య భక్తి పారవశ్యాల సమ్మేళనం!
                                                           - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌ 

No comments:

Post a Comment