ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 16 October 2013

త్యాగ సంస్మరణల పర్వదినం


త్యాగం, ప్రేమ, కరుణ, ఉపకారం వంటి దైవీగుణాల్ని అలవరచుకొని ప్రతి మనుజుని మనసు పరిశుద్ధమైన కొద్దీ ప్రపంచశాంతి పరిఢవిల్లుతుందని పర్వదినాలు బోధిస్తాయి. ఈ గుణగణాల్ని అవగాహన చేసుకొని ఆచరిస్తే ప్రతి ఒక్కరు ఉన్నత జీవితాన్ని గడపగలరని, ఉత్తమ గతులు పొందగలరని ఉద్గ్రంథాల సారం. త్యాగనిరతి కలవారి ధర్మ సందేశాల్ని, గాథల్ని బక్రీద్‌ పర్వదిన సందర్భంగా ముస్లిమ్‌ పండితులు వినిపిస్తారు. త్యాగం విశ్వవిభుడి ఆనందానికి హేతువవుతుందని వివరిస్తారు.
బక్రీద్‌ పర్వదినాన్నే 'ఈదుల్‌ అజ్‌హా' అనీ అంటారు. అజ్‌హా అంటే విశ్వవిభునికి సమర్పించే బలిదానం అని అర్థం. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమై జీవితాంతం విమలపథం వీడని దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన త్యాగ గుణాలతో పరమ విభుని మెప్పించిన మహనీయుడు. దైవాజ్ఞ, ధర్మరక్షణల నిర్వహణలో పుత్రప్రీతి అడ్డుకాకూడదని తలచిన మహా మనిషి. ఆయన అల్లాహ్‌ ప్రసన్నం కోసం చేసిన అసమాన త్యాగాల్ని ఈ పండుగ సందర్భంగా ముస్లిములు స్మరించుకొంటారు.

సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇప్పటి ఇరాక్‌ దేశంలో ప్రవక్త ఇబ్రాహీమ్‌ జన్మించారు. ఆ కాలంలో ఆ దేశమంతా అశాంతి చెలరేగింది. న్యాయానికి ధర్మానికి నిలువనీడ లేకపోయింది. నమ్రూద్‌ అనే క్రూరమైన రాజు ఆ దేశాన్ని పాలించేవాడు. ఆధ్యాత్మిక ప్రగతికి విఘాతం ఏర్పడింది. అతడి దుష్టపాలనను ప్రజలు సహించారే తప్ప వ్యతిరేకించలేని శక్తిహీనులయ్యారు. అలాంటి భీతావహ పరిస్థితిలో నమ్రూద్‌ రాజు నిరంకుశత్వాన్ని, కల్పించుకొన్న దైవత్వాన్ని హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ ప్రజల మధ్య నిరసించారు. రాజు వెంటనే హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ను పిలిపించాడు. తనపై చేస్తున్న వ్యతిరేక ప్రచారం గురించి ప్రశ్నించాడు- ఇబ్రాహీమ్‌ సౌమ్య పదజాలంతో సమాధానమిచ్చాడు- 'విశ్వవిభుడు ఒక్కడే. ఆయనే ఆరాధ్యుడు. సకల చరాచర సృష్టికి మూలకారకుడు. నిర్మల జీవనం గడుపుతూ జనుల్ని పాలించేవాడే నిజమైన రాజు. ధర్మేతర శక్తులు తలెత్తని విధంగా తన రాజ్యాన్ని మలచుకోగలిగిన పాలకుడే దైవానికి ఇష్టుడు. హృదయంలేని ధర్మాలకు నిబంధనలకు జీవం పోయడం తగదు' అని.

హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ సమాధానం విన్న రాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఇబ్రాహీమ్‌కు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఇబ్రాహీమ్‌ ధర్మపత్నిని వెంట పెట్టుకొని ఉన్న వూరిని, కన్నవారిని, దేశాన్ని వీడి బయలుదేరారు. కష్టాల సహిష్ణుతే ఆయన కవచమైంది. శాంతిదూతగా అనేక దేశాలు పర్యటించారు. తన అనంతరం దివ్య సందేశాన్ని పుడమికి అందించే నిమిత్తం సంతానం ప్రసాదించమని సంతానం లేని తాను దైవాన్ని ప్రార్థించారు. మగబిడ్డ కలిగాడు. ఇబ్రాహీమ్‌ దంపతులు మురిసిపోయారు. ఇంతలో భార్యాబిడ్డల్ని ఎడారిలో వదలి రమ్మని దైవం ఇబ్రాహీమ్‌ను ఆదేశించాడు. దైవాజ్ఞానుసారం భార్యాబిడ్డల్ని ఎడారిలో వదిలారు. అది దిక్కు, దెసలేని ప్రాంతం. కనీసం గుక్కెడు నీళ్లు కూడా అక్కడ దొరకవు. నీటి దప్పికవల్ల బాధపడుతున్న ఆ పసిబాలుడు తన కాలి మడమలతో ఇసుక మీద రాసిన చోట నీటి వూట ఉబికింది. ఇప్పటికీ ఆ పవిత్ర జలాన్ని 'ఆబె జమ్‌జమ్‌' పేరిట ముస్లిములు తీర్థజలంగా దేహ తాపాలు, మనోక్లేశాలు తొలగించే దివ్యౌషధంగా సేవిస్తున్నారు. ఆ ఎడారి ప్రాంతమే నేటి మక్కానగరమంటారు.

హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన తనయుడు ఇస్మాయీల్‌ సహాయంతో మక్కాలో కాబా గృహం నిర్మించారు. అది దైవగృహం అయింది. ఒకరోజు హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన కుమారుడు ఇస్మాయీల్‌ కంఠాన్ని స్వహస్తాలతో ఖండిస్తున్నట్లు కలగన్నారు. ఇది దైవాజ్ఞ అని తండ్రి భావించారు. విషయం కుమారుడికి చెప్పారు. ఏ మాత్రం ప్రతిఘటించని కుమారుడు దైవాజ్ఞను నెరవేర్చండన్నాడు. దైవ నామస్మరణ చేస్తూ భక్తిలో లీనమైన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ కుమారుని మెడ జుబహ్‌ చేయడానికి (కోయడానికి) ఉద్యుక్తులయ్యారు. వెంటనే దైవవాక్కు వినిపించింది- ఇబ్రాహీమ్‌! నీవు ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యావు. నీ త్యాగనిరతి, అహంకార మమకార రహిత సన్మార్గ ప్రవర్తన ప్రసన్నత కలిగించాయి- అని.

ఐహిక సుఖాలు వీడి, విశ్వవిభుడి ఆజ్ఞల్ని పరమభక్తితో పాటించి విన్నవారి హృదయాలు జలదరించే విధంగా త్యాగాలకు ఒడిగట్టిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ ఆదర్శప్రాయుడై ఇస్లామ్‌ చరిత్రలో సుస్థిరంగా నిలిచారు.

బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారు. ఉదయం ఎనిమిది గంటలనుంచి పదిన్నర గంటల మధ్య సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఆల్పాశయుల ఆచరణ ప్రపంచ సభ్యతకు సిగ్గుచేటని, దైవచింతన ఉన్నా విశ్వమానవ శ్రేయాన్ని ఆలోచించనప్పుడు అది సంపూర్ణంగా నిరుపయోగమైందనిబక్రీద్‌ బోధిస్తోంది.
                                     
                                                             - డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

No comments:

Post a Comment