ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 14 October 2013

వృక్షో రక్షతి రక్షితః


మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఏ మాటలను పొందుపరిస్తే మంత్రం అవుతుందో, ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్నప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, మేడి, మర్రి, మారేడు, వేప, జమ్మి మొదలైనవి పవిత్రమైనవిగా భావించి మన పూర్వీకులు వీటిని దేవాలయ ప్రాంగణాల్లో, మామిడితోటల్లో వూరి మధ్యన పెంచి మనకు తెలియని ఉపకారం చేశారు. వారి దూరదృష్టి వలనే నేడు పెద్దపెద్ద వృక్షాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనుషులకు, పశువులకు నీడనివ్వడమే కాకుండా పక్షి సంతతి జీవించడానికి ఆధారమయ్యాయి. విలువ తెలియని నేటి కాలం మానవులు స్వార్థప్రయోజనంతో ఏదో సాకుతో మహోన్నత వృక్షాలను నేలకూల్చి పర్యావరణానికి హాని చేస్తున్నారు. పక్షిజాతి అంతరించడానికీ కారకులవుతున్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి.
రావిచెట్టు, వేపచెట్టు, మామిడిచెట్టు బొగ్గుపులుసు వాయువును ఎక్కువగా స్వీకరించి, మానవులకు అవసరమైన ప్రాణవాయువును అధిక మోతాదులో విడుదల చేసి ఆరోగ్యవంతులుగా ఉండటానికి దోహదపడుతున్నాయి. వేప, రావిచెట్లు రెండూ కలిసి ఒకచోట ఉంటే లక్ష్మీనారాయణ స్వరూపమని ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. ఆదివారంనాడు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల రావి వేపలో ఉండే గాలి ప్రభావం వల్ల పిల్లలు లేని వారికి సంతాన యోగ్యత కలుగుతుందని పెద్దలు చెబుతారు. రావిచెక్కను కొన్ని రోగాలకు మందుగా వాడతారు.

మర్రిచెట్టు నీడన పరమశివుడు దక్షిణామూర్తి రూపాన కొలువైవుండి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వసిస్తారు. మర్రిచెట్టు వూడలు, వేళ్లతో చేసిన చూర్ణం వంధ్యత్వాన్ని పోగొట్టి సంతానవంతులను చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

మారేడు లక్ష్మీస్వరూపమని, త్రిమూర్తుల ప్రతీకగా భావించి శివకేశవులను ఇద్దరినీ మారేడు దళాలతో పూజిస్తారు. మారేడుపండు గుజ్జు ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేసి అనేక రోగాలను పోగొట్టడానికి వాడతారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచారని మహాభారతం తెలియజెబుతోంది. యజ్ఞయాగాదులకు జమ్మిచెక్కను రాపిడి చేసి అగ్ని పుట్టించి సమిధలు వెలిగిస్తారు. జమ్మిచెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయంటారు. దాన్ని ఉపయోగించి ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధాలు తయారుచేస్తారు. విజయదశమి నాడు జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటి ముందు కానీ, పెరట్లో కానీ పవిత్ర ప్రదేశంలో దీన్ని పెంచి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. 'తులసి కోట' లేక 'బృందావనం' అని తులసిని పెంచే చోటును పిలుస్తారు. తులసి సర్వరోగ నివారిణిగా, అనేక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా మామిడితోరణాలు కట్టకుండా జరగదు. ఇది హిందూ సంప్రదాయం. మామిడి కొమ్మలు ప్రాణవాయువును ఇవ్వడమే కాకుండా క్రిమికీటకాలను అడ్డుకుంటాయి. వాటిని ఇంటిలోనికి రానివ్వవు. మామిడికాయలు, పళ్లు రుచికరం, ఆరోగ్యదాయకం. మేడిచెట్టు దత్తాత్రేయుడికి ప్రీతికరమైందంటారు. ఆ స్వామి ఆ చెట్టు నీడన ఎల్లవేళలా ఉంటాడని నమ్మి మేడిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఆయుర్వేద వైద్యానికి, కొన్ని వ్యాధుల నివారణకు మేడిపళ్లను, చెట్టు బెరడును ఉపయోగిస్తారు.

ఉసిరిచెట్టుకే అమలక వృక్షమని మరో పేరు ఉంది. ఉసిరిచెట్టు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. కార్తికమాసంలో దీపారాధాన చేసి ప్రదక్షిణలు చేయడమే కాకుండా చెట్టుకింద వనభోజనాలు చేస్తారు. ఉసిరికాయ సర్వరోగాలకు దివ్య ఔషధం. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఫలం.

ఇంకా అనేక వృక్షాలను భగవంతుడు మనకు ప్రసాదించాడు. స్వచ్ఛమైన గాలి, నీడతోపాటు ఔషధాలు, మధుర ఫలాలు, కలప అందిస్తున్న వాటిని సంరక్షించకుండా మట్టుపెట్టడం మంచిదికాదు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రత పెరగడానికి వృక్ష సంతతిని నాశనం చేయడమే ప్రధాన కారణం. వృక్షో రక్షతి రక్షితః అని అందరూ గ్రహిస్తే భూమి ఇంకా కొన్నాళ్లు పచ్చగా ఉంటుంది.
                                                                  - మహాభాష్యం నరసింహారావు

No comments:

Post a Comment