ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 25 October 2013

దైవంతో భాషణం


   'వాన్‌! సమస్త చరాచర ప్రాణికోటిలో నిన్ను సందర్శించేటట్లు, నా జీవితంలో ప్రతి శ్వాస నీ స్మృతిలో ఉండేటట్లు నా ప్రతి చర్య నీ సేవకు అంకితమయ్యేటట్లు కటాక్షించు!'
'భగవాన్‌, నా మనసు నిరంతరం నీ దివ్యరూపాన్ని ధ్యానించేటట్లు, నా వాక్కు నీ నామాన్ని గుణాలను గానం చేసేటట్లు, నా శరీరం నీ సేవ చేసేటట్లు అనుగ్రహించు!'- ఇవి భక్తుడి ప్రార్థనలు.

మన హృదయాన్ని దైవం ముందు ఆవిష్కరించుకోవడాన్ని ప్రార్థన అన్నారు. అది ఏ గ్రంథం లోనిదైనా కావచ్చు. శ్లోకం కావచ్చు; పద్యం గాని, పాట గాని కావచ్చు. మాటలే లేని మౌన ధ్యానమూ కావచ్చు. భగవంతుడితో భక్తుడు జరిపే సంభాషణ ప్రార్థన. ప్రార్థన మనిషి జీవితంలో, ఆలోచనల్లో భాగం. ప్రార్థన మన శ్వాస వంటిదే.

కవులు తమ కావ్యారంభంలో ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. తమ కావ్యాలకు యశస్సు, పండితాదరణ కావాలని కోరుకుంటారు. కావ్యావతారికల్లో ఇష్టదైవాన్ని తమ ప్రభువులకు విజయ పరంపర కలిగించమని ప్రార్థిస్తారు. రాజాశ్రయం కోరని పోతన 'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్‌' అన్నాడు. అంటే, మోక్షం కోసం రాస్తున్నానని విన్నవించుకున్నాడు. భక్త రామదాసు కీర్తనల్లో ఆర్తి, ప్రేమ, కోరిక కనిపిస్తాయి. వీటిలోంచి విన్నపం పుడుతుంది. అదీ ప్రార్థనే. అధికారికి విన్నవించుకునేటప్పుడు అతడి విశ్రాంతి సమయం చూసుకుని, మనోభావం చిత్తవృత్తి గ్రహించి మరీ వ్యవహరిస్తారు. అలాగే భగవంతుడికి షోడశోపచారాలు చేసి కొంతసేపు కీర్తిస్తారు. నీ సేవకుడినంటూ దాసోహం చేస్తారు.

కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు కొందరికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు కష్టాలు తొలగించమని ప్రార్థిస్తారు. మొసలి వల్ల తన ప్రాణం పోవడం నిశ్చయం అనుకొని గజేంద్రుడు 'నా బలం నశించిపోతోంది. ధైర్యం తరిగిపోయింది. ప్రాణాలు పోతున్నాయి... వచ్చి రక్షించు!' అని శ్రీహరిని ప్రార్థించాడు. నిత్య జీవితంలో సంకటాలు ఎదురైనప్పుడు, కోరికలు నెరవేరనప్పుడు, ఏదైనా ఆశించినప్పుడు దైవాన్ని ప్రార్థించడం పరిపాటి. కాని, ప్రార్థనను జీవితంలో భాగంగా చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస ప్రతినిత్యం తాను భగవంతుడితో మాట్లాడుతున్నానని చెప్పేవారు. నరేంద్రుడు ఆయన దగ్గరకు వెళ్ళి తన సమస్యలు చెప్పి తన కష్టాలు తీరేలా జగన్మాతను ప్రార్థించమని అర్థించాడు. రామకృష్ణులు 'నువ్వే ప్రార్థించు. అమ్మ నీ మొర ఆలకిస్తుంది' అన్నారు. నరేంద్రుడు ఆలయానికి వెళ్ళి కళ్లు మూసుకొని దేవిని ప్రార్థిస్తుంటే ఆ శక్తి స్వరూపిణి తన కళ్ల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆ సమయంలో ఆయనకు తన కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు రాలేదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రసాదించమని కోరుకున్నాడు. దేవి అంతర్ధానమయ్యాక మళ్ళీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు వచ్చాయి. తన కోరిక చెప్పుకోలేకపోయానని బాధపడ్డాడట. ఇలా మూడుసార్లు జరిగింది. సమస్యలు, కష్టాలు, సంక్షోభాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. ఎవరికి వారే వాటిని పరిష్కరించుకోవాలి. అందుకు అవసరమైన శక్తిని ఇవ్వమని మాత్రమే భగవంతుని ప్రార్థించాలి.

ప్రార్థనలో హృదయశుద్ధి, భగవద్విశ్వాసం ముఖ్యం. నమ్మకం లేనప్పుడు ప్రార్థన సాధ్యం కాదు. సర్వాంతర్యామి మనముందు నిలబడి మనం చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు నమ్మాలి. దైవాన్ని నిరాకారుడిగాను, నిర్గుణుడిగాను కూడా ప్రార్థించవచ్చు. దైవాన్నే గాక త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువునూ ప్రార్థించవచ్చు. ప్రార్థన వల్ల అజ్ఞానికి జ్ఞానం, పిరికివాడికి ధైర్యం, కష్టాల్లో ఉన్నవాడికి ఓదార్పు లభిస్తాయి. ప్రార్థనవల్ల మనలోని అహంకారం నశిస్తుంది. సాత్వికత పెంపొందుతుంది. ఆత్మబలం ఇనుమడిస్తుంది. మనసు ప్రక్షాళనమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. శాంతి సహనాలు వృద్ధి చెందుతాయి. ప్రార్థించే సాధకుడికి ప్రశాంత జీవనశైలి అవసరం. ప్రార్థన మన జీవన విధానంలో మార్పు తీసుకువస్తుంది. ప్రార్థించేవారికి శరణాగతి ముఖ్యం. ధర్మవిరుద్ధమైన, న్యాయ ప్రతికూలమైన ప్రార్థనలు ఎన్నటికీ ఫలించవు. సాధకుడికి ధార్మిక వర్తనం ముఖ్యం. యోగ్యమైన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు.

వ్యక్తిగత క్షేమం గురించి కాక రుషులు, మహనీయులు లోక కల్యాణం కోసం ప్రార్థించారు. సకల జనులకు శుభం కలగాలని, అన్ని లోకాలు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. సగుణారాధన విశ్వసించని బ్రహ్మసమాజం వంటి సంస్థల్లో ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. మనమూ నిర్భాగ్యుల కోసం, బలహీనుల కోసం ప్రార్థించాలి!
                                                    
                                                    - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment