ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 17 October 2013

నాదోపాసన


శిశువూ, పశువూ, ఆఖరికి పాముసైతం గానరసాన్ని ఆస్వాదిస్తాయని నానుడి. సంగీతం కేవలం హృదయాహ్లాదకరమే కాదు. మోక్షమార్గం కూడా! సర్వేశ్వరుడు సంగీత ప్రియుడు. శివుడి ఢమరుక వాయిద్యం నుంచి వెలువడిన ధ్వనులే అచ్చులూ హల్లులూ అంటారు. అవే భాషా సాహిత్యాలకు ఆధారం. సరస్వతీ స్వరూపంగా వీణను ఆరాధిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ వేణుగాన లోలుడు. ఈశ్వర సాన్నిధ్యం పొందడానికి సంగీతాన్నే సాధనంగా ఎంచుకొని విద్వాంసులెందరో కలకాలం నిలిచే కృతులను రచించి సుకృతులయ్యారు. ఆధ్యాత్మికవేత్తలు నాదాన్ని వేదంగా భావిస్తారు. పరమ పవిత్రమైన శ్రీరామాయణాన్ని కుశలవులు గానం చేశారు. స్వరార్చనతో ఈశ్వరార్చన గావించిన త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, స్వాతితిరుణాళ్‌, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు వంటివారెందరో కొన వూపిరి ఉన్నంతవరకూ తమ ఇష్టదైవాలను గురించి అసంఖ్యాక కృతులను ఆలపిస్తూనే జీవయాత్ర గడిపారు. భౌతికంగా ఆ మహాత్ములు నేడు లేకపోయినా, ఎన్నో వేలమంది సంగీత సాధనలో నిమగ్నులై ఉన్నారు. సంగీతాన్ని మోక్షమార్గంగా చూపుతూనే ఉన్నారు.
నారద తుంబురాది ఎందరో మహానుభావులు... నాదోపాసన ద్వారా అంతర్యామిని అర్చించారు. వారి దృష్టిలో సంగీతం ఒక ఉత్తమ ఉపాసనా మార్గం ఓంకారనాదం సృష్ట్యాది నుంచీ లోకమంతా నిండి ఉంది. ఓంకారం ఈశ్వరనామాల్లో సర్వశ్రేష్ఠమైనది. త్యాగరాజు వంటి మహాత్ములకు ప్రాణం ప్రణవం. త్యాగయ్య భక్తిభావ బంధురమైన కృతులతో శ్రీరామచంద్రుణ్ని ఆరాధించాడు. విగ్రహాలు కనబడనప్పుడు ఆయన శోకమూ గానమే, తిరిగి లభించినప్పుడు సంతోషమూ సంగీతమే! సాక్షాత్తు నారదుడే త్యాగయ్యకు సంగీతశాస్త్రాన్ని ప్రసాదించాడని గాథ. నాదోపాసకులకు నరస్తుతి ఇష్టం ఉండదు. ఇష్టదైవాన్ని స్తుతించిన నోటితో దుష్ట నరప్రభువుల గురించి కృతులు చెప్పడానికి అన్నమయ్యా తిరస్కరించాడు. త్యాగయ్యా కాదు పొమ్మన్నాడు. త్యాగయ్య కోరి పేదరికాన్ని వరించాడు. నిధికంటే రాముని సన్నిధే సుఖమని ఘంటాపథంగా చెప్పాడు.

'సంగీతానికి భక్తి మూలం' అన్నాడు ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు వూత్తుకాడు వెంకట సుబ్బయ్య అయ్యర్‌. 'భక్తియోగ సంగీతమార్గమే పరమపావనం' అని గానం చేశాడు. గోపీకృష్ణుల మధుర ప్రేమను పరవశంతో వర్ణించాడు. పాడి లోకాన్ని పరవశం గావించాడు. గణపతి, కామాక్షి, శ్రీరాముడు, కార్తికేయులపై ఆయన కీర్తనలు ఆలపించాడు. సంగీతం భక్తిమయం అయినప్పుడే హృదయరంజకంగా విరాజిల్లుతుందని ఆయన ప్రకటించాడు. భక్తి సంగీతాన్ని ముక్తిమార్గంగా ఎంచుకున్నాడు ఆ మహానుభావుడు. తిరువాన్కూరు ప్రభువు స్వాతి తిరునాళ్‌ మహారాజు సంగీతమే సద్గతికి గతి అని విశ్వసించాడు. ఈయన కులదైవం పద్మనాభస్వామి. వేలకొలది కీర్తనలు రచించి, తన స్వామిపై భక్తి ప్రపత్తులను సంగీత మార్గంలో ప్రకటించి ధన్యుడయ్యాడు.

ప్రతి కృతికీ పద్మనాభ అనేదే మకుటం. జీవితాంతం తిరునాళ్‌ తిరువనంతపురం పద్మనాభస్వామిని సంగీతంతో సమర్చించి శ్రీకైవల్యం చెందాడు. త్యాగరాజు నాదోపాసకుడు. శ్రీరామ భక్తి సామ్రాజ్యాధినేత. రామావతార విశిష్టతను ఎంత వర్ణించినా త్యాగయ్యకు తనివి తీరలేదు. ఆనాటి త్యాగయ్య కృతులు నేటికీ సంగీతప్రియులకేగాక సర్వజన సమ్మోహనకరాలు. మనుషుల గురించి కీర్తించడం ఆయనకు నచ్చదు, ఒక్క శ్రీరామచంద్రుని తప్ప! ఈ నాదోపాసకులందరూ మహా పండితులు, బహుభాషావేత్తలు, సంగీతశాస్త్రాన్ని ఔపోసన పట్టినవారు- అన్నింటికీ మించి మహాభక్తులు. తమ భాషా పాండిత్యాన్ని సంగీతశాస్త్ర ప్రావీణ్యాన్ని దైవాంకితం గావించి, తమ కృతులకు రాగాలు సమకూర్చి తుదకు దైవసాన్నిధ్యం పొందారు. వారి రచనలను ఆలపించి తరించిన వారెందరో ఉన్నారు. నేటికీ సంగీత సభల్లో అవి శ్రోతలను బ్రహ్మానంద సంభరితం కావిస్తూనే ఉన్నాయి.

ముత్తుస్వామి దీక్షితులు వీణావాదన నిపుణుడు. సంగీత దివ్యత్వాన్ని స్వానుభవం ద్వారా గ్రహించిన మహాత్ముడు. నాదం జగన్నాథంగా భావించి ఆరాధించాడు. తీర్థయాత్రలు చేసి సర్వ దేవతారాధన గావించాడు. కాశీ విశ్వనాథుని గురించీ, అన్నపూర్ణాదేవిని గురించీ సంగీతారాధన చేసేటప్పుడు ఉత్తరాది సంగీతాన్ని వినియోగించడం ఆయన విశిష్టత. త్యాగయ్య 'ఎందరో మహానుభావులు' అన్నది సంగీతాన్నే ముక్తి మార్గంగా ఎంచుకున్న ఈ పుణ్యాత్ములను గురించే. శ్రీమన్నారాయణుడిపై గానం చేసిన నారదుడు చిరంజీవి. నాదోపాసనను మోక్షమార్గంగా భావితరాలకు చూపిన మన సంగీత సరస్వతులందరూ చిరంజీవులే!
                                                               - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment