ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 1 October 2013

తప్పు-ఒప్పు

                                           
ప్పుచేయడం మానవసహజం. ప్రతీ మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. చేసిన తప్పు తెలుసుకొని సక్రమ మార్గంలో నడిచే ప్రయత్నం చేయడం ముఖ్యం. తప్పని తెలిసి అదే పనిగా తప్పులు చేస్తూపోవడం క్షమార్హం కాదు. తాను చేస్తున్న పనివల్ల ఎదుటి వ్యక్తికి కష్టం కలుగుతుంది, ఆ వ్యక్తి బాధపడతాడని తెలిసీ తప్పుచేయడం తగనిపని.

తప్పుడు తోవలో నడిచేవారు తాము చేస్తున్నది సరియైనదే అని సరిపెట్టుకోవడం, సమర్థించుకోవడం ఆత్మవంచనే అవుతుంది. అడ్డదారిలో అన్యాయంగా దౌర్జన్యంగా సంపాదించే డబ్బు పాపిష్టిదే అవుతుంది. తాను చేసిన తప్పు తన జీవితాన్ని దహించి వేస్తుంది. కాని తనను నమ్మినవారి పట్ల దురుసుగా వ్యవహరించడం పతనానికి దారితీస్తుంది. దానివల్ల తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది. అది క్షేమదాయకం కాదు. ఆట్టే శ్రమపడకుండా సంపాదించడమే కొందరి ధ్యేయం. వీరిలో నీతి, నిజాయతీ, మంచి, న్యాయం లాంటి సద్గుణాలు దాదాపు కొరవడినట్లే. పైగా అలా తప్పు చేసినవారికి ఆ తప్పును ఎత్తిచూపిస్తే అవతలి వ్యక్తిని తప్పుపట్టడం వీరి ప్రవృత్తి.

రావణుడు సీతను ఎత్తుకొని రావడం తప్పని చెప్పిన విభీషణుని రాజ్యం నుంచి పంపేశాడు. రావణుడి భార్య కూడా ఇది వినాశనానికి దారి తీస్తుందని చెప్పినా పెడచెవిన పెట్టి, అహంకారంతో ఎగిసిపడి సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. శిశుపాలుడు తప్పు మీద తప్పుగా వంద తప్పులు చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. స్నేహం నటిస్తూ ఆశ్రయం ఇచ్చినవారికే అన్యాయం తలపెట్టడం కొందరి నైజం. అది తప్పు అని వారికి తెలుసు. చేసిన తప్పు దిద్దుకొని పునరావృతం కాకుండా ధర్మపథంలో నడిచేవాడు ఉత్తముడు. తప్పు చేశానని పశ్చాత్తాపం చెంది ఆత్మను ప్రక్షాళనం చేసుకొని నిర్మల, నిష్కల్మష మనస్కుడిగా మారాలి.

'ఒప్పు' అనే మాటకు సమ్మతి, ఏకీభవించు, ఒప్పిదమైన, యుక్తమైన, లక్షణమైన అని అర్థాలున్నాయి. మనం చేసే పని అందరూ హర్షించే విధంగా ఉండాలి. మనం చేసే పని తప్పా, ఒప్పా, మన ప్రవర్తనవల్ల ఎదుటివారికి బాధ కలిగిందా అని ఆలోచించే విచక్షణా జ్ఞానం భగవంతుడిచ్చాడు కదా. మన స్వార్థం కోసం పక్కవారికి కష్టం కలిగించకూడదు. తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది. తెలిసి తప్పు చేసి పరులకు హాని కలిగించాలనుకుంటే ఆ వ్యక్తి క్షమార్హుడు కాదు. దానికి నిష్కృతి లేదు.

తాను చేస్తున్నది తప్పే అయినా అదే సరైనదని మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించడం తగని పని. చేసిన తప్పును గ్రహించి, పశ్చాత్తాపం చెంది తదనుగుణంగా తన ప్రవర్తనను సరిదిద్దుకోవడంలో మన ఔన్నత్యం ఉంది. అదే ఒప్పిదమై రాణిస్తుంది. తెల్లవారి నిద్రలేచింది మొదలు పక్కమీదకు చేరేవరకు తప్పులు చేస్తూ నీతివాక్యాలు వల్లించడం వ్యర్థం. అలాంటివారిని సమాజం అసహ్యించుకుంటుంది. వారి నోటికి జడిసి దూరంగా వైదొలగుతారు. ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకొని ఒప్పిదమైన జీవితాన్ని గడపడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడం అవసరం. యుక్తాయుక్త విచక్షణతో మెలగుతూ లక్షణంగా బతుకు సాగించాలి.

చాలామందికి ఎదుటి మనిషిలో తప్పులు వెతుకుతూ రంధ్రాన్వేషణ చేసే అలవాటు ఉంటుంది. గురివింద గింజ తన కింద నలుపెరుగనట్లు వీరు తమ తప్పును తెలుసుకోరు. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది. అది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అప్పుడే తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో తన ప్రవర్తన సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
- వి.ఎస్‌.ఆర్‌.మౌళి

No comments:

Post a Comment