ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 18 October 2013

దేహమే ఆత్మగా...


మానవుడికి దేహభావం ప్రధానంగా ఉంటుంది. అలా ఉండకూడదనీ, 'నేను' అంటే ఆత్మే అనీ, దేహం దానికి ప్రత్యక్ష ఉపాధి మాత్రమేననీ వేదాలు, విజ్ఞులు, మహాత్ముల బోధలు ఘోషిస్తున్నాయి. నిజమే. ఆత్మను అసలు నేనుగా గ్రహించేందుకే, అనుభవించేందుకే మానవుడి తపోసాధనలు. శ్రీకృష్ణుడన్నట్లు అన్ని వడబోతలు పోను, కోట్లమందిలో ఒకరో ఇద్దరో మాత్రమే అసలు తత్వాన్నెరిగి నిలబడగలరు. మరి దేహానికంత ప్రాధాన్యం లేనప్పుడు, ఎవరో మహానుభావుడన్నట్లు శ్రీరామ, శ్రీకృష్ణ సుందర రూపాలనెందుకు భక్తులు, రుషులు, గోపికలు, అర్జునుడు ఆరాధించారు? వారికి ఆత్మలు లేవా లేక దేహాలే ఆత్మలా? పురుషులకే మోహాన్ని కలిగించే శ్రీరాముడికి 'నేను' అంటే- ఆయన రూపమా? చిన్నాపెద్దా, వివాహితులు, అవివాహితులు అనే తేడా లేకుండా భువన మోహనరూపుడైన శ్రీకృష్ణుని వెంటబడి అందరూ ఎందుకు పరుగులు తీశారు? శ్రీకృష్ణుని ఆత్మ ఆయన దేహంగానే అభివ్యక్తమైందా? శ్రీరాముడు మానవుడిగానే పుట్టాడు. మానవుడిగానే జీవించాడు. ఎంతగా అంటే ఆయన సాక్షాత్‌ శ్రీహరి అన్న విషయం రుషులకు తెలిసినంతగా కూడా ఆయనకు తెలీనంతగా. ఒక సాధారణ మానవుడి దేహాన్ని (లోకం దృష్టిలో) ఇంతగా ప్రేమించాలా?!
ఏమిటీ దేహం, ఎవరీ ఆత్మ, రెండింటికీ సమన్వయం లేదా? పరస్పర సహకారం, అవగాహన... లేవా? దేహానికి లోపాలున్నా, పనిచేస్తూనే ఉన్నా, చేయిస్తూనే ఉన్నా దేహస్పృహకు అందనిది, అర్థం కానిది ఆత్మ... దేహం అసలు తత్వాన్ని పట్టుకునే వరకు.

అసలు ఆత్మలోంచి, ఆనందాత్మలోంచి, ఆ పరమ ఆత్మలోంచి అంశారూపంగా, అసలు సూత్రంలోంచి తెగిపడకుండా, విడివడకుండా, కేవలం సూత్రప్రాయంగా ఒక దేహం ఆసరాగా ఈ లోకంలోకి వచ్చిందే జీవాత్మ. దేహం వేరు. ఆత్మ వేరు. కానీ చివరి వరకూ, దేహం నిలిచే వరకూ (బహుశా ఆత్మ దాన్ని నిలిపేవరకూ) రెండూ కలిసే ఉంటాయి. ఉండాలి. ఎందుకంటే రెండూ పరస్పరాధారితాలు. అయితే ఆత్మను ధరించి, దాని ఆధారంగా మాత్రమే నడయాడే దేహానికి ఆత్మ గురించిన ఆచూకీ తెలియదు. ఆ స్పృహా ఉండదు. తానో స్వయంప్రతిపత్తిగల అపురూప రూపాన్ననే భావిస్తుంది. అపోహ పడుతుంది. అహంకరిస్తుంది. ఇలాంటి దేహాన్ని ధరించిన రామ-కృష్ణులు, వారి రూపాలు... అవి ఎంత అతిశయ లోకోత్తర సౌందర్యమూర్తులు కానీగాక... అంత ఆరాధ్యనీయాలెలా అయ్యాయి? ఆకర్షకమూర్తులు ఎలా అయ్యారు?

రాముడు-కృష్ణుడు... మనం లోతుగా పరిశీలిస్తే... చివరకు వాళ్లు భగవదవతారాలు అన్న విషయాన్ని కూడా విస్మరించి చూస్తే వాళ్లలోని లోకోత్తర 'మానవీయ' గుణాలు మనకు అడుగడుగునా సృష్టమవుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పిన దైవీగుణాలు పొల్లుపోకుండా వారిలో వూపిరిపోసుకున్నాయి. పోతపోసిన ధర్మ విగ్రహం శ్రీరాముడు. శ్రీకృష్ణుడు అప్పడప్పుడూ లౌక్యమో, పక్షపాతమో ప్రదర్శించాడన్న అపోహ ఉన్నా అది కేవలం అపోహే. ఎందుకంటే ధర్మం అత్యంత సూక్ష్మమైనది. దాన్ని నిభాయించడం, అక్షరాలా నిర్వహించటం, రామకృష్ణులు మాత్రమే చేయగలిగారు. ధర్మం బాహ్యదృష్టికి గోచరం కానిది. అది మనోధర్మం, రంధ్రాన్వేషణకు అందనిది. విమర్శలకు లొంగనిది. ప్రశంసలకు పొంగనిది. అది కేవలం ఆచరణీయం. రామ, కృష్ణుల వంటి లోకోత్తర పురుషులకు ఆరాధనీయమైనది.

వీరిలోని మరో అపురూప గుణం- వారు ఆత్మదేహ భావంతో జీవించినవారు కాదు! ఆత్మభావంతో ఆత్మగానే జీవించారు. పరమాత్మకు ప్రతిరూపంగా(పరమాత్మే అయినా మానవ దేహంలో ఉన్నారు కాబట్టి), పరమాత్మగానే నడయాడినవారు. మరి వారి దేహాలు అత్యంత ఆకర్షక కేంద్రాలు కావటంలో ఆశ్చర్యమేముంది?!

వారి తిరుగులేని ఆకర్షణకు ఇదే అసలు కారణం. ఆత్మ భావమే. 'ఆత్మ' సౌందర్యానికి, 'ఆత్మ' ఆకర్షణకు వయసు, సౌందర్యం, శౌర్యం లాంటివాటితో పనిలేదు. చంద్రుని చుట్టూ వెన్నెల నిండి ఉన్నట్లు ఆత్మే స్వయం ఆకర్షకం. ఆధునిక రుషులైన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివారూ వారి వయసుతో పనిలేకుండా యావత్‌ ప్రపంచాన్నీ పాదాక్రాంతం చేసుకున్నారు.
                                                                          
                                                                            -చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment